కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్నారులు, మహిళలు, వృద్ధులు చివరికి అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని కూడా వదలడం లేదు. తాజాగా విశాఖ జిల్లాలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ మృగాడు.

వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పదమూడేళ్ల బాలిక మానసిక వికలాంగురాలు. ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో స్థానిక శ్మశనవాటిక వద్ద వున్న వరహానది సమీపానికి తీసుకుని వెళ్లాడు..

అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటు దాడి చేసి, శరీరంపై విచక్షణారహితంగా గాయపరిచాడు. ఆమె అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని రాజును పట్టుకుని దేహాశుద్ధి చేశారు.

గ్రామంలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించి, బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.