గుంటూరులో నడిరోడ్డుపై దళిత యువతి రమ్యను అతి కిరాతకంగా హతమార్చిన ప్రేమోన్మాది శశికృష్ణను శిక్షించడానికి ఇంకా 17రోజుల డెడ్ లైన్ మాత్రమే మిగిలింది... ఎలా శిక్షిస్తారో ఇంకా చెప్పలేదు అని సీఎం జగన్ ను ప్రశ్నించారు టిడిపి నాయకులు నారా లోకేష్.
మంగళగిరి: దళిత యువతి రమ్యను అతికిరాతకంగా చంపిన ప్రేమోన్మాది శశికృష్ణను కఠినంగా శిక్షించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కేవలం రమ్య కుటుంబానికే కాదు వైసిపి పాలనలో అఘాయిత్యాలకు గురయిన 500మంది అక్కాచెల్లెమ్మల కుటుంబాలకు న్యాయం జరిగేవరకు తాను పోరాడతానని లోకేష్ స్ఫష్టం చేశారు.
''వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి ఉరి శిక్ష అన్నారు కదా జగన్ గారు!మీ రెండేళ్ల పాలనలో 500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయి ఈ రోజు వరకూ ఒక్కరికి కూడా శిక్ష పడింది లేదు. ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడి రోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించండి.ఇక 17 రోజులు మాత్రమే మిగిలాయి'' అని లోకేష్ గుర్తుచేశారు.
''జగన్ రెడ్డి అరాచకపాలనలో అఘాయిత్యాలకు గురైన 500 మంది అక్కాచెల్లెమ్మల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను. దళిత కుటుంబానికి అండగా నిలబడితే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తారా? అదే నా నేరమైతే.. ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లతో కేసులు పెట్టుకో..'' అని అన్నారు.
read more మహిళల రక్షణకే ప్రాధాన్యత: ఏపీ హోంమంత్రి సుచరిత
''దళితబిడ్డ రమ్య హంతకుడిని శిక్షించే వరకూ నా పోరాటం ఆగదు. 500 కుటుంబాలకీ న్యాయం జరిగేవరకూ 500 సార్లయినా నేను జైలుకెళ్లేందుకు సిద్ధం. మీకు ఇచ్చిన డెడ్ లైన్ కి ఇంకా 18 రోజులే ఉంది. రమ్యని హత్య చేసిన మృగాడికి ఏం శిక్ష వెయ్యబోతున్నారు జగన్?'' అని లోకేష్ ప్రశ్నించారు.
''రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది'' అని మండిపడ్డారు.
''ప్రతిపక్ష పార్టీల నాయకులని తిట్టడం, కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడం పై పెట్టివుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యి ఉండేవి కావు. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి'' అని జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.
