అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కలిసి పనిచేయడాన్ని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యతిరేకిస్తన్నారు. కేసీఆర్ కలిస్తే జగన్ పాతాళానికే వెళ్తారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ నడుస్తున్నారని, కేసీఆర్ డైరెక్షన్ లో జగన్ నడుస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మోడీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. మోడీకి కేసీఆర్ బీ టీమ్ అని ఆయన వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ వంటి దొరలకు టీఅర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్తే బీసీలు జగన్ కు ఓటు వేయాలా అని ఆయన ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం తప్ప కేసీఆర్ బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే.