హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఇరిగెల సోదరులు శనివారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ నేతలు పలువురు ఈ సందర్భంగా శనివారంనాడువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 

హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో శనివారం ఉదయం టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్‌ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. వారిని శిల్పా చక్రపాణి రెడ్డి తన వెంట జగన్ వద్దకు తీసుకుని వచ్చారు. 

ఇరిగెల రాంపుల్లారెడ్డి గతంలో ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అయితే టీడీపీలో తమకు సరైన గౌరవం లేదని, కష్టకాలంలో అండగా నిలిచిన తమకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటూ ఇరిగెల సోదరులు అసంతృప్తిగా ఉన్నారు. 

ఇప్పటికే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాస్‌, దాసరి జై రమేష్‌ తదితరులు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.