తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ బహిష్కృత నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. టీడీపీలో కొనసాగుతూనే.. వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నాడనే కారణంతో.. మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బుధవారం ఇడుపుల పాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని చెప్పారు.

ప్రజలకు సేవ చేసేవాళ్లకు టీడీపీలో స్థానం లేదని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని.. ఇప్పుడు ఆయన ఆశీర్వాదం కోసం ఇడుపుల పాయకు వచ్చినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.