సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజమండ్రి పోలీసులు ఆయనపై  కేసు నమోదు చేశారు.  

రాజమండ్రి: ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణమురళిపై  రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు  రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు  కేసు నమోదు చేయకపోవడంతో  హైకోర్టును ఆశ్రయించారు  జనసేన కార్యకర్తలు. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణమురళిపై   కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో రాజమండ్రి పోలీసులు  కేసు నమోదు చేశారు.

గతంలో కూడ పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2021లో హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో  పోసాని కృష్ణమురళి  మీడియా సమావేశం ఏర్పాటు చేసి  పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అయితే  పోసాని కృష్ణమురళిపై  ఆ సమయంలో జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ విషయమై  జనసేన, పోసాని కృష్ణమురళిలు పరస్పరం హైద్రాబాద్ పంజాగుట్టలో  ఫిర్యాదు చేసుకున్నారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని  పవన్ కళ్యాణ్ ఈ నెల 1న వ్యాఖ్యానించారు. వారాహి యాత్రలో భాగంగా  ఆవనిగడ్డలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై  ఈ  పోసాని కృష్ణమురళి స్పందించారు.  గతంలో టీడీపీని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన  వీడియో క్లిప్పింగ్ లను  పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశంలో చూపారు.