రాజమండ్రి: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని విమర్శించారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం కూడా పాటించడంలేదన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు. మాస్కు వేసుకోకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు  ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న కార్మికులను నిర్మాణ సంస్థ జాగ్రత్తగా స్వంత గ్రామాలకు పంపి తిరిగి రప్పించిందన్నారు. ఇదే రకంగా అన్ని సంస్థలు అలానే చేస్తే వలస కార్మికులు చనిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు.చైనా దేశంతో దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. చరిత్రలో ఏనాడూ కూడ చైనా ఈ రకమైన పరిస్థితిని చవిచూడలేదన్నారు. 

అవినీతి రహిత పాలనను అందిస్తానని సీఎం జగన్ హామీ చెప్పారు. పేదలకు అవ స్థలాల్లో పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ స్థలాల్లో పేదలకు పట్టాలు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఇది నిరూపయోగమైన ప్రతిపాదనగా ఆయన చెప్పారు. 

ఇళ్ల పట్టాల ప్రతిపాదన మంచి చేయకపోగా చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ కు ఆయన హితవు పలికారు. మరో వైపు రాష్ట్రంలో  ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.