రాజమండ్రి:పోలవరం ప్రాజెక్టును 41.5 మీటర్ల వరకే రిజర్వాయర్ ముందుగా కడతామన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక కుట్ర ఉందని  రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చం్దరబాబు నాయుడి దారిలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఎత్తు పెంచారా లేదా అనేది ఎవరు పట్టించుకోరన్నారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేసుకొనేలా రిజర్వాయర్ కట్టాల్సిందేనని ఆయన చెప్పారు. లేకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.పునరావాస ప్యాకేజీ నిధులపై కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన జగన్ కు సూచించారు. రాజీపడితే రాష్ట్రానికి ద్రోహం చేసినవారవుతారన్నారు. 

ఏపీ దాటిన తర్వాత గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయన్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి పోకుండా నీళ్లు ఆపాలంటే పునరావాసం తప్పదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటికి వాడకపోతే గోదావరి జలాలు మనకు వస్తాయన్నారు. లక్షల మందికి పరిహారం చెల్లించకపోతే పునరావాస పనులు ముందుకు సాగవని ఆయన అభిప్రాయపడ్డారు.

పునరావాస భారాన్ని కేంద్రమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో పునరావాస ప్యాకేజీయే కీలకమని ఆయన చెప్పారు. తెలంగాణలో కట్టే ప్రాజెక్టులపై ఎవరైనా నోరెత్తితే జైలుకు పంపుతానని కేసీఆర్ హెచ్చరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

గోదావరి నీటిని వాడుకోవాలంటే పోలవరం తప్పితే ఏపీకి మరో మార్గం లేదని ఆయన చెప్పారు. ఇతర చోట్ల గోదావరి నది మార్గంలో కొండలున్నాయని ఆయన వివరించారు. తాగునీటి కోసం ఉపయోగించే ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్నారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. 

పన్నుల రేషియో మార్చారు కాబట్టి ప్రత్యేక హోదా లేదని  నీతి ఆయోగ్ 2015 డిసెంబర్ 1వ తేదీన తేల్చిందని ఆయన గుర్తు చేశారు. అయినా కూడ కేంద్రం కబుర్లతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా నీతి ఆయోగ్ అతిక్రమించి రూలింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన తప్పుల్నే జగన్ సర్కార్ కూడా చేస్తోందన్నారు. నిజాలు చెప్పకుండా జనాన్ని జగన్ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. 

పోలవరం విషయంలో కేంద్రంతో జరిపిన సంప్రదింపులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీకి కేంద్రం ద్రోహం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ కాంపొనెంట్ అంటే ప్రాజెక్టు కాస్ట్ తో పాటు భూ పరిహారం, పునరావా ప్యాకేజీ కూడా కలిపేనని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.