సారాంశం
ఈ మూడురోజులు తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : మండుటెండలతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలకు చల్లని కబురు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ వర్ష ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే పిడుగులు పడే ప్రమాదం వుందని... ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.
పశ్చిమ బిహార్ నుండి చత్తీస్ ఘడ్ మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని... ఇలా మూడురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదివారం ఏపీలోని అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాలో తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు. ఇక ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు.
Read More రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇదిలావుంటే తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు కొమరంభీం, మంచిర్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ,వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. వర్షాలతో పాటు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
పిడుగులు పడే అవకాశాలున్నాయి కాబట్టి వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద వుండకూడదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలతో పాటు పశువులు, గొర్ల కాపర్లు జాగ్రత్తగా వుండాలని... మూగ జీవాలను కూడా వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.