వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో  గాలులు వీస్తాయని, అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడే అవకాశం వుందని తెలిపింది.

ఇదిలావుంటే బుధవారం కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మంగళవారం వానలు కురిశాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

శుక్రవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వుందని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.