ఎవరి ఇంట్లో అయినా దొంగతనం జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అదే పోలీసులే దొంగతనం చేస్తే... అదే  జరిగింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దొంగల అవతారం ఎత్తి... దొంగతనాలకు పాల్పడ్డారు. కానీ.. అలవాటు లేని పనికదా.. అందుకే వెంటనే రైల్వే పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కావలి పట్టణంలోని పీఎంఆర్ సిల్వర్ ప్యాలెస్ యజమాని మల్లికార్జున రావు ఈ నెల 15వ తేదీన సురేఖ అనే మహిళకు రూ.50లక్షలు నగదు ఇచ్చి చెన్నైలో బంగారం కొని తీసుకురావాలని చెప్పాడు. అయితే.. ఆమె తాను ఒంటరిగా వెళ్లలేనని మరో మహిళ సాయం తీసుకుంటానని చెప్పింది. దీనికి యజమాని సరే అనడంతో అనిత అనే మహిళను చెన్నై తీసుకువెళ్లేందుకు ఒప్పించింది. అదేరోజు వారిద్దరూ నగదు తీసుకొని కావలి రైల్వేస్టేషన్ లో ట్రైన్ ఎక్కారు.

గూడూరు స్టేషన్ చేరుతున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి తనిఖీల పేరిట వారి బ్యాగులను తీసుకొని రైలు దిగి పరార్యారు. విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో ఇది ఆరుగురు కలిసి వేసిన పథకంగా తేలింది. ఆరుగురిలో నలుగురు పోలీసులు ఉండటం గమనార్హం. పథకం ప్రకారం ఈ ఆరుగురూ కలిసి రైలులో సురేఖ నుంచి రూ.50లక్షల నగదును దోచేశారు. పోలీసు శాఖలో ఆర్‌ఐ స్థాయి అధికారే దొంగతనానికి ప్రోత్సహించడం, ముగ్గురు కానిస్టేబుళ్లు దొంగతనంలో కీలక పాత్ర వహించడం జిల్లాలో సంచలనంగా మారింది. సాధారణ దొంగలకంటే ఈ చోరీలో కీలక పాత్ర వహించిన పోలీసులను కఠినంగా శిక్షిస్తామని, ఇప్పటికే వీరిని ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేశామని డీఎస్పీ తెలిపారు.