కారులో మృతదేహం: ఆ రోజు ఫోన్ చేసి రాహుల్ ను పిలిచిన గాయత్రి
జిక్సిన్ సిలిండర్స్ యజమాని కరణం రాహుల్ హత్య కేసులో విజయవాడ మాచవరం పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. గాయత్రి అనే మహిళ ఆ రోజు ఫోన్ చేసి రాహుల్ ను పిలిచినట్లు తెలుస్తోంది.
విజయవాడ: పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కరణం రాహుల్ ను హత్య చేసి మృతదేహాన్ని కారులో వదిలేసిన విషయం తెలిసిందే. హత్య కేసులో పోలీసులు దాదాపుగా నిందితులందరినీ గుర్తించినట్లు తెలుస్తోంది.
విజయవాడలో జరిగిన రాహుల్ హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హత్య జరిగిన రోజు గాయత్రి అనే మహిళ ఫోన్ చేసి రాహుల్ ను పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో రాహుల్ కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒక మహిళ ఉందని సమాచారం. తమకు లొంగిపోయిన కోరాడ విజయ్ కుమార్ ను, అతని అనుచరులను పోలీసులు విడివిడిగా విచారిస్తున్నారు.
హత్యలో కీలక పాత్ర పోషించిన కోరాడ విజయ్ కుమార్ కు, రాహుల్ కు మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలులో స్నేహం ప్రారంభమైంది ఫుంగనూరు ఫ్యాక్తరీ ప్రారంభోత్సవం సమయానికి వారిద్దరి మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. రాహుల్ హత్యకు ఫ్యాక్టరీలో పనిచేసే బీహార్ కు చెందిన వ్యక్తి ఒకతను కోరాడ విజయ్ కుమార్ కు సహకరించినట్లు భావిస్తున్నారు.
రాహుల్ హత్య జరిగిన తర్వాత పరారీలో ఉన్న కోరాడ విజయ్ కుమార్ ఆదివారంనాడు మాచవరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ నెల 19వ తేదీన మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన కారులో జిక్సిన్ సిలిండర్ యజమాని కరణం రాహుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
రాహుల్ హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్న ప్రశ్నించారు. రాహుల్ తో పాటు కోరాడ విజయ్ కుమార్ జిక్సిన్ ఫ్యాక్టరీలో భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు