ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శనివారం భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ యాత్ర ను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కాగా.. దీనిని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఖండించారు.

తమ భరోసా యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి రౌడీలను పంపించారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. జగన్ రౌడీ పార్టీని  స్థాపించారని ధ్వజమెత్తారు. పదేళ్లు కాంగ్రెస్ లో ఉండి పందికొక్కుల్లా దోచుకున్న వారు మా యాత్రను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.

వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్ లో కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.