ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ.. నీలం రంగు పార్టీ కండువా కప్పుకోలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.  ఇటీవల సోషల్ మీడియాలో వైఎస్ నీలం రంగు పార్టీ జెండా కప్పుకొని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా.. ఆ ఫోటోపై ఈరోజు రఘువీరా రెడ్డి వివరణ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ ఏనాడూ నీలం రంగు కండువా కప్పుకోలేదని, ఓ మార్ఫింగ్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తోందని రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతరం తెలంగాణ ఎన్నికల గురించి, ఏపీలో టీడీపీ పొత్తు గురించి కూడా ఆయన మాట్లాడారు.  తెలంగాణలో మహాకూటమి కచ్చితంగా అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో  బీజేపీ, టీఆర్ఎస్ లు అంపశయ్యపై ఉన్నాయన్నారు. టీడీపీ తో కాంగ్రెస్‌ పొత్తును ఏపీసీపీ మనస్పూర్తిగా స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. పొత్తుకు 3 నెలల ముందే అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునే అధికారాన్ని రాహుల్‌ గాంధీకి ఇష్టపూర్వకంగానే కట్టబెట్టామని చెప్పారు. కేసీఆర్‌ నిరాశ, నిస్పృహ, నీరసం, అసహనంతోనే రాహుల్‌గాంధీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఓటమిని ముందే ఒప్పుకొంటున్నందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధికి వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డితోపాటు ఇతర సీఎంలు అంతా కాంగ్రెస్‌ జెండా కిందే కృషి చేశారని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.