వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును హైదరాబాదు తరలించే సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కారులో కూర్చున్న రఘురామ కృష్ణమ రాజు మీసం మెలేస్తూ కనిపించారు.

గుంటూరు: వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును సిఐడి అధికారులు హైదరాబాదుకు తరలించే సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఐడి అధికారులు ఆయనను సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 

సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి బయలుదేరడానికి కారులో కూర్చున్నప్పటి నుంచి రఘురామ కృష్ణమ రాజు మీసం మెలేస్తూ కనిపించారు. మీడియా కెమెరాలు కనిపించగానే ఆయన మీసాన్ని తిప్పుతూ కనిపించారు. దాని వెనక ఉద్దేశం ఏమిటనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

జైలుకు సిఐడి అధికారులు తనను పంపించాలనే సిఐడి అధికారుల ఉద్దేశం నెరవేరలేదని ఆయన అలా మీసం మెలేశారని అంటున్నారు. సిఐడి అధికారుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నైతికంగా తాను విజయం సాధించినట్లు చెప్పడానికి అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. 

ప్రభుత్వంపై కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణపై రెండు రోజుల క్రితం రఘురామ కృష్ణమ రాజును హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలనే కింది కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిఐడి అభ్యంతరం తెలియజేయడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దాంతో సోమవారం సాయంత్రం సిఐడి అధికారులు రఘురామ కృష్ణమ రాజును హైదరాబాదు తరలించారు. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతాయి.