న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చిక్కుల్లో పడేయడానికి కొత్త అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే ప్రమాదం ఉందని ఆయన జగన్ ను హెచ్చరించారు. న్యాయవ్యవస్థను గౌరవించిక పోతే ఆర్టికల్ 356 ఉపయోగించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి రావచ్చునని ఆయన అన్నారు. 

న్యాయవ్యవస్థను గౌరవించాలని జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఇటీవల రాసిన పుస్తకంలో ఉందని, ఆమె రాసిన పుస్తకంలోని 75వ పేజీలో ఆ విషయాలు ఉన్నాయని రఘురామ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పుస్తకాన్ని విడుదల చేశారు గానీ చూడలేదని ఆయన అన్నారు. 

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే విషయం చెప్పారని, తానైనా సుప్రీంకోర్టు అయినా అదే విషయం చెబుతామని ఆయన అన్నారు. "సీఎం గారూ.... రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను తృణీకరించి., ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రపతి పాలన కొని తెచ్చుకోకండి" అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే కాకుండా రాజ్యాంగ, న్యాయవ్యవస్థలను బేఖాతుర చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించినప్పుడు కూడా 356 అధికరణ అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రే న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి, అవహేళన చేస్తుంటే ప్రజులు కూడా వాటిని గౌరవించే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి గానీ, ప్రభుత్వం గానీ ఈ విధమైన రాజ్యాంగేతతర, అప్రజాస్వామిక, న్యాయవ్యతిరేక పరిస్థితులకు తావు ఇవ్వకూడదని రఘురామ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార విచారణను నిలిపేయాలన్ని జనగ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణమ రాజు మీడియాతో మాట్లాడారు. 

రాజ్యాంగ, న్యాయవ్యవస్థలపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి మంచిది కాదని అంటూ ఇకనుచైనా మనసు మార్చుకోవాలని, రాజ్యాంగాన్నీ ప్రజాస్వామ్యాన్నీ గౌరవించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశారని, కాబట్టి రాజ్యాంగ విలువలకు కట్టుబడుదామని ఆయన అననారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని ఆయన అన్నారు. 

ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా కొనసాగించడానికి జగన్ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. నిమ్మగడ్డ కులం సీఎంకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఆయనే కమిషనర్ అని రఘురామ అన్నారు. ఇప్పటికైనా కోర్టు తీర్పును గౌరవించి ఆయనను కొనసాగించకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిక్కుల్లో పడుతారని ఆయన హెచ్చరించారు.