బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డికి అధికారులు క్వారంటైన్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రెడ్ జోన్ లో ఉన్న కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయనను హోం క్వారంటైన్ చేశారు. 

ఈ మేరకు బుధవారం అధికారులు ఆయన ఇంటికి నోటీసును అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉండి కూడా తాను లేనని చెప్పడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్‌ మారుతి తెలిపారు. 

నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. రెడ్‌జోన్‌ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

మరోవైపు తనకు హోం క్వారంటైన్ నోటీసులు ఇవ్వడంపై విష్ణువర్థన్‌రెడ్డి స్పందించారు. తనకు హోం క్వారంటైన్ నోటీసులు ఇవ్వలేదన్నారు. తనకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుందని.. దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు ఉందన్నారు. 

కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని.. స్థానిక సీఐ, ఎస్సైలకు తెలియక నోటీసులు ఇచ్చారన్నారు. 24 గంటల పాటూ తనకు సెక్యూరిటీ ఉంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రత కల్పిస్తాయన్నారు. అధికార పార్టీ మిడి, మిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని.. జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్‌లో పెడతారా అని ప్రశ్నించారు.

అధికార పార్టీ నేతలకు ఓ రూల్.. ప్రతిపక్ష పార్టీలకు మరో రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టం వచ్చినట్లు జిల్లాల్లో తిరిగారని.. వారిని ఎందుకు క్వారంటైన్‌కు పంపలేదని ప్రశ్నించారు.