అమరావతి: ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు నియోజకవర్గం పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. జమ్మలమడుగు పంచాయతీ పీటముడిని చంద్రబాబు విప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య రాజీకి చేసిన చంద్రబాబు ప్రయత్నం సక్సెస్ అయ్యింది. 

దీంతో కడప జిల్లా టీడీపీ నేతలు హమ్మయా అంటూ ఊపరి పీల్చుకున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి రామసుబ్బారెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధాల కాలంగా ఇరువురు మధ్య పాత గొడవలు ఉన్నాయి. 

అలాంటి తరుణంలో ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం రామసుబ్బారెడ్డి తట్టుకోలేకపోయారు. టీడీపీలోకి రావడంతోపాటు మంత్రి పదవి కొట్టేయ్యడంతో పుండుమీద కారం చల్లినట్లైంది రామసుబ్బారెడ్డికి. సమయం వచ్చిన ప్రతీసారి మంత్రి ఆదినారాయణరెడ్డిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. 

ఒకానొక దశలో రామసుబ్బారెడ్డి పార్టీ వీడతారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారు. అయినా ఇరువురి మధ్య ఆదిపత్య పోరు ఏ మాత్రం తగ్గలేదు. 

జమ్మలమడుగు సీటుపై రచ్చరచ్చ చేస్తున్నారు. సీటు తనదంటే తనదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డిలలో ఒకరిని అసెంబ్లీకి, మరోకరిని పార్లమెంట్ కి పంపాలని భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఇద్దరికీ స్పష్టం చేశారు కూడా. 

అయితే ఇద్దరు నేతలు జమ్మలమడుగు నియోజకవర్గంపైనే పట్టుబట్టారు. పార్లమెంట్ కు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం కార్యకర్తలు నేతలతో సమావేశం నిర్వహించారు. 

ఉదయం సాయంత్రం రెండుసార్లు నిర్వహించినా ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురికి క్లాస్ పీకారు. ఈ నెలాఖరున కార్యకర్తల సమావేశంలోనే తేల్చుకుని రావాలంటూ ఆదేశించారు. అయితే గురువారం మరోసారి జమ్మలమడుగు నియోజకవర్గం పంచాయితీపై సమావేశం జరిగింది. 

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ,కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా నేతలతో చంద్రబాబు చర్చించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రాజీకి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. 

చివరికి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక బాధ్యత తమకే వదిలేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఎవరు ఎంపీగా పోటీ చేయాలి అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని నేతలు చెప్పారు. తాను ఎంపీగా పోటీ చెయ్యాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది చంద్రబాబు నిర్ణయిస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కడప జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

నా వల్ల కాదు, మీరే తేల్చుకోండి : జమ్మలమడుగు పంచాయతీపై చేతులెత్తేసిన చంద్రబాబు