Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీ రగడ: జీతాలు ప్రాసెస్ చేయకుంటే కఠిన చర్యలు, ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ మెమోలు

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ట్రెజరీ శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సర్కార్ కన్నెర్ర చేసింది.

prc row : ap govt issues memos to treasury department
Author
Amaravathi, First Published Jan 29, 2022, 6:05 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ట్రెజరీ శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సర్కార్ కన్నెర్ర చేసింది. ట్రెజరీ ఉద్యోగులకు శనివారం మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. 

కాగా.. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని జనవరి 25న ట్రెజరీ శాఖకు ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు డీడీవోలకు ఏపీ ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. అంతకుముందు జనవరి 20వ తేదీన కూడా రాష్ట్రంలోని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ప్రభుత్వ ఒత్తిడికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసింది పీఆర్సీ సాధన సమితి (prc steering committee) . పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ డీడీవోలకు రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రిక్వెస్ట్ లెటర్ ప్రోఫార్మాను సిద్దం చేసింది పీఆర్సీ సాధన సమితి. తమకు పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ పంచాయతీ రాజ్ శాఖ డీడీవోకు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని సాంకేతికంగా ఇరుకున పెట్టొచ్చని భావిస్తోంది పీఆర్సీ సాధన సమితి. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత పాత జీతాలు కోరుతూ.. రిక్వెస్ట్ లెటర్ పెట్టాలని ఈ నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు మిగిలిన ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ , వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తమ మద్ధతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కీలక శాఖలు ఉద్యమంలోకి వెళ్తామని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు ఎస్మా ప్రయోగించడంపైనా ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్ధం చేస్తున్నారు ఉన్నతాధికారులు. 

అవసరమైతేనే ఎస్మా ప్రయోగించాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మెలను నిషేధిస్తూ విద్యుత్ శాఖ ఇటీవలే జీవో జారీ చేసింది. తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు వైద్య, విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఓ వైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌కు ఉద్యోగులు సహకరించడం లేదు. 4.50 లక్షల బిల్లులకు కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయని ఏపీ ఆర్ధిక శాఖ చెబుతోంది. పరిస్ధితి చేయి దాటకుండా చూసుకునేలా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఆరంభించినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios