ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ నేత ప్రతిభా భారతి ఆరోగ్యం విషమంగా ఉంది.. వైద్యానికి ఆమె శరీరం సహకరించకపోవడం లేదని వైద్యులు తెలిపారు.. రెండ్రోజుల క్రితం లక్షకు పైగా ఉన్న ప్లేట్‌లెట్ల సంఖ్య ఆదివారం రాత్రికి 60 వేలకు పడిపోయాయి.

అయితే దీని వల్ల శరీరానికి ఇన్‌ఫెక్షన్లు వస్తుండటం.. హిమోగ్లోబిన్ శాతం కూడా తక్కువగా ఉండటంతో రక్తాన్ని ఎక్కించడం నిలిపివేశారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. దీనికి స్పందించి ప్రతిభా భారతి తేరుకుంటే సాధారణ వార్డుకు ఆమెను తరలిస్తారు.

లేని పక్షంలో మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిభా భారతిని రాష్ట్రమంత్రి కళా వెంకటరావు, ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు పరామర్శించారు.

గత శుక్రవారం విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్యను చూసేందుకు వచ్చిన ఆమె.. తండ్రిని చూడగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.. దీంతో ప్రతిభా భారతికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.