Asianet News TeluguAsianet News Telugu

ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా..?

ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ.. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. 

Prashanth Kumar Mishra May Appointed as AP HIGH Court CJ
Author
Hyderabad, First Published Sep 18, 2021, 12:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నియమితులు కానున్నట్లు  తెలుస్తోంది.  సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు  సమాచారం. అలాగే, ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ.. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఏపీకి మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు సమాచారం. కొలిజియం సిఫార్సులను అధికారికంగా వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంది.

జస్టిస్‌ మిశ్రా ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు  చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెపె్టంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios