తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 పట్టభద్రల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ రోజు పోలింగ్ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 పట్టభద్రల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ రోజు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 4 గంటల తర్వాత కూడా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్స్ తరలించే ప్రక్రియ చేపట్టారు. మార్చి 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గం మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది. ఈ ఎన్నిక కోసం హైదరాబాద్‌లో 22 పోలింగ్ కేంద్రాలతో సహా 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే ఏపీలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు కలకలం రేపాయి. తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలో దొంగ ఓట్లు వేస్తున్న పలువురు పట్టుబడ్డారు. పదో తరగతి చదివిన ఓ మహిళ.. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకన్న ఘటన వెలుగుచూసింది. అనుమానంతో మహిళను ప్రశ్నించగా.. పదో తరగతి మాత్రమే చదివినట్లు స్వయంగా ఆమే చెప్పింది. తాను తమిళనాడు వాసినని... వాలంటీర్ ఓటర్ స్లిప్పు ఇచ్చి ఓటేయాలని పంపారని సదరు మహిళ తెలిపింది. అసలు ఇవి ఏ ఎన్నికలో కూడా తనకు తెలియదని సదరు మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగింది. ఈ క్రమంలోనే పలు చోట్ల టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఇష్టారీతిన వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్టుగా కనిపిస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవని ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఓట్లు గల్లంతు కావడంతో కూడా ఓటర్లు ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి పలు సంఘటనలను తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
-శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
- శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గానికిఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు.
- పశ్చిమగోదావరి స్థానిక సంస్థల రెండు నియోజకవర్గాలకు 6 గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
-కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
-ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 8మంది బరిలో నిలిచారు.
- కడప–అనంతపురం–కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉన్నారు.
ఇక, ఏపీలో మొత్తం 9 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీకాగా.. అందులో ఐదుచోట్ల కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎస్ మంగమ్మ, కడప స్థానిక సంస్థల స్థానం నుంచి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల స్థానం నుంచి మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి స్థానిక సంస్థల స్థానం నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు స్థానిక సంస్థల స్థానం నుంచి నుంచి సుబ్రమణ్యం సిపాయి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
