అమలాపురం: అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై అరెస్ట్ వారంట్ జారీ అయింది. హర్షకుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

కొన్ని రోజుల క్రితం అమలాపురం కోర్టు ఆవరణలో ఉన్న పాన్‌షాప్ ను కూల్చివేసే సమయంలో హర్షకుమార్ అడ్డుకొన్నారు.ఈ సమయంలో జ్యూడీషీయల్ సిబ్బందితో పాటు అక్కడే ఉన్న మహిళలపై దురుసుగా హర్షకుమార్ ప్రవర్తించాడని ఆయనపై కేసు నమోదైంది.

ఈ కేసులో హర్షకుమార్ పై అరెస్ట్ వారంట్ జారీ అయింది.ఈ కేసులో హర్షకుమార్ ను అరెస్ట్ చేసేందుకు ఆదివారం నాడు రాత్రి పోలీసులు హర్షకుమార్ ఇంటికి చేరుకొన్నారు. కానీ, ఆ సమయంలో హర్షకుమార్ ఇంట్లో లేరు. హర్షకుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చిన్న కేసులో తనకు అరెస్ట్ వారంట్ జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎం జగన్ కు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజల తరపున మాట్లాడడమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. హర్షకుమార్ ఓ వీడియో సందేశాన్ని మీడియాకు పంపారు.ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతోందిన హర్షకుమార్ ఆరోపించారు.

దేవీపట్నం వద్ద బోటు మునిగిన ఘటనలో మంత్రి అవంతి శ్రీనివాస్ పై హర్షకుమార్ ఇటీవల తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడ స్పందించారు.