ఒంగోలుకి చెందిన వార్డు వాలంటీర్, దివ్యాంగురాలు ఉమ్మనేని భువనేశ్వరి(22) ఇటీవల అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడింది. పోలీసుల దర్యాప్తులో ఆమెది ఆత్మహత్యగా తేలింది. కుటుంబ సమస్యలు, తనకు ఉన్న శారీరక సమస్యల కారణంగా ఆమె తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుందని పోలీసులు చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒంగోలు లోని గోపాల్ నగర్ కు చెందిన భువనేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తన సోదరి నర్మద సాయి కూడా దివ్యాంగురాలే. వారి తల్లి జానకి కలక్టరేట్ ఎదుట ఓ పుస్తకాల దుకాణంలో పనిచేస్తూ ఇద్దరు పిల్లను పోషిస్తోంది. కాగా.. బీకామ్ పూర్తి చేసిన భువనేశ్వరి దూరవిద్య విభాగంలో ఎంబీఏ చదువుతోంది.  సచివాలయంలో ప్రస్తుతం వార్డు వాలంటీర్ గా పనిచేస్తోంది.

కాగా.. ఈమె ఒంగోలు కమ్మపాలెం-దశరాజుపల్లి రోడ్డులో ఈ నెల 18వ తేదీన అనుమాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి  కనిపించింది. కాగా.. ఆమెను ఎవరో హత్య చేశారని అందరూ భావించారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తవ్ర కలకలం రేపింది. అయితే.. దర్యాప్తులో ఆమెది ఆత్మహత్యగా తేలిందని పోలీసులు చెప్పారు.

ఈ నెల 18న తనకు మూడు లీటర్ల పెట్రోల్ కావాలని ఆమె రాము అనే ఆటోడ్రైవర్ ని అడిగింది. ఆమె కోరినట్లుగానే అతను కొని తీసుకువచ్చి ఆమెకు ఇచ్చాడు. ఆ పెట్రోల్ ని తీసుకొని వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మంటల్లో కాలిపోవడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

కాగా.. భువనేశ్వరి ఓ యాప్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉండే తన మిత్రులతో చాటింగ్ చేసేదట. చనిపోవడానికి ముందు కూడా ఆమె తన స్నేహితులకు మెసేజ్ ద్వారా తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అయితే.. ఆమె అంత స్పష్టంగా చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పెట్టినా, స్నేహితులకు షేర్ చేసినా ఎవరూ పట్టించుుకోకపోవడం గమనార్హం. చనిపోవడానికి 15 రోజుల ముందు నుంచి ఆమె అలాంటి పోస్టులు పెడుతూనే ఉంది. ఎవరూ కనీసం ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించలేదు.. కనీసం ఆమె కుటుంబసభ్యులకు కూడా తెలియజేయకపోవడం గమనార్హం.