కర్నూల్: కర్నూల్ కు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అనంతపురంలోని మారుతినగర్ కు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్లుకు చెందిన రంగనాయకులు హైద్రాబాద్ నుండి కర్నూల్ వైపు కుప్పం డిపో కు చెందిన బస్సులో వస్తున్నారు.

వీరు  రూ. 1.9 కోట్ల నగదును తమ బ్యాగుల్లో తరలిస్తున్నారు.ఈ విషయమై పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు పంచలింగాల చెక్ పోస్టు వద్ద బస్సును తనిఖీ చేస్తే వీరి నుండి రూ. 1.9 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు.
ఈ నగదుకు సంబంధించి వారు ఎలాంటి పత్రాలు చూపలేదు.  

నగదును సీజ్ చేసి కర్నూల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పొలం కొనుగోలు కోసం హైద్రాబాద్ వెళ్లినట్టుగా రామచౌదరి చెప్పారు. బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నట్టుగా పోలీసులకు చెప్పారు. 

ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై పోలీసులు వారిని విచారిస్తున్నారు. పొలం కొనుగోలు కోసమే ఈ డబ్బును తీసుకెళ్లారా... ఇంకా ఏదైనా కారణం ఉందా అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.