తిరుమలలో రెండు రోజుల క్రితం ఏడాదిన్నర వయసుగల బాలుడు కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. బాలుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించనప్పటికీ.. ఈ కేసులో కొంత పురోగతిని సాధించారు పోలీసులు. నిందితుడి ఫోటోను విడుదల చేయడంతోపాటు అతను నెల్లూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసు బృందాన్ని నెల్లూరు కూడా పంపించినట్లు తెలిపారు. నిందితుడు చిన్నారిని తీసుకొని రైలు ఎక్కి పారిపోయినట్లుగా  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్, దాలింభాయ్ దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడు వీరేష్ తో సహా.. శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. అయితే.. బస చేయడానికి రూమ్ దొరకకపోవడంతో.. యాత్రి సముదాయం-2 ఎదురుగా ఉన్న షెడ్ లో సేదతీరారు. అక్కడ బాలుడిని నిద్రపుచ్చి.. ప్రశాంత్, అతని భార్య స్నానానికి వెళ్లారు.

వారు తిరిగి వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. వెంటనే చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.