టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడును గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుడిలా తనిఖీ చేయడంపై రాద్ధాంతం కొనసాగుతోంది. దీనిపై కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఐజీ దామోదర్ స్పందించారు.

విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీల్లో మాజీ ముఖ్యమంత్రులకు మినహాయింపులేదని, చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదన్నారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చికాగో కన్వెన్షన్‌లోని 17వ అనుబంధం ప్రకారం సభ్యదేశాలు అన్నీ పాటించాల్సిందేనని తెలిపినట్లుగా ఆయన గుర్తు చేశారు.

దీని ప్రకారం ఐక్య రాజ్యసమితి సభ్యదేశంగా భారత్ ఆ నిబంధనలను పాటించాల్సిందేనని దామోదర్ తెలిపారు. స్వతంత్ర సంస్థ అయిన స్టాండర్డ్స్ అండ్ రికమండెడ్ ప్రాక్టీసెస్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ కూడా జారీ అయిందని గుర్తు చేశారు.  

దీనిలో మాజీ ముఖ్యమంత్రులకు, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వారికీ కూడా విమానాశ్రయాల్లోకి ప్రవేశించే ముందు తనిఖీల నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారని దామోదర్ వెల్లడించారు.

గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను కూడా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసిన విసయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని జయలలిత కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారన్నారు.

అమెరికాలోని ట్రాన్స్‌పోర్టు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల మేరకు అక్కడి విమానాశ్రయంలో గతంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాంను తనిఖీ చేశారని దామోదర్ తెలిపారు.

ఈ నిబంధనల ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యున్నత మిలటరీ అధికారులు సైతం భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదన్నారు.

ఇక మనదేశానికి వస్తే.. విమానాల సొంత యజమానులైనా, ప్రైవేట్ ఆపరేటర్లు అయినా లోపలికి వెళ్లే ప్రతీసారి సీఐఎస్ఎఫ్‌, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేస్తారన్నారు. ఈ నిబంధనల ప్రకారమే చంద్రబాబును భద్రతా సిబ్బంది తనిఖీ చేశారని దామోదర్ పేర్కొన్నారు.