అర్ధరాత్రి హైడ్రామా.. విజయవాడ వెళ్లేందుకు పవన్ కు అనుమతి..
Pawan Kalyan: విజయవాడకు వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనుమతి లభించింది. ఎట్టకేలకు పోలీసులు పవన్ కళ్యాణ్ కు అనుమతి ఇచ్చారు.జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది.

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం హైదరాబాద్- విజయవాడ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోజు మార్గంలో విజయవాడకు బయలు దేరారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద పోలీసులు పవన్‌ని అడ్డుకున్నారు.
ఈ తరుణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జీకి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే.. వీసా, పాస్‌పోర్టు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు. క్రమంగా అక్కడి పరిస్తితి ఉద్రితక్తంగా మారింది.
ఇలా పలు నాటకీయ పరిణామాలు నడుమ విజయవాడకు వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనుమతి లభించింది. దీంతో జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు సాగింది. కేవలం మూడు కార్లతోనే ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. అంతకముందు అర్ధరాత్రి హైడ్రామా నడిచింది.
పోలీసులతో పవన్ కళ్యాణ్ చర్చ అనంతరం ఎట్టకేలకు విజయవాడకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు అనుమతి లభించింది. కానీ ఏపీ పోలీసులు కండిషన్లు పెట్టారు.భారీ కాన్వాయ్ కాకుండా కేవలం 3 కార్లతోనే విజయవాడకు వెళ్లాలని సూచించారు. మార్గమధ్యంలో ఎక్కడా కూడా ఆగకూడని సూచించారు. అలాగే నాయకులతో గాని కార్యకర్తలతో గానీ ఎలాంటి సమావేశాలను ఏర్పాటు చేయరాదని ఆదేశించారు. ఇలా పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి నుండి విజయవాడకు బయలుదేరారు.