విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి వెండి రథంపై సింహాల ప్రతిమల అదృశ్యంపై శుక్రవారం నాడు పోలీసులు విచారణ చేస్తున్నారు. రథాన్ని క్రైమ్ డీసీపీ పరిశీలించారు. ఈ విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు.

వెండి సింహాల ప్రతిమలు చోరీకి గురయ్యాయని  పోలీసులకు దుర్గగుడి ఈవో సురేష్ బాబు ఈ నెల 17వ  తేదీన ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. 

also read:దుర్గగుడి రథంలో మూడు సింహాల ప్రతిమలు అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

వెండి రథాన్ని పాలిష్ చేసేందుకు  శర్వానీ ఇండస్ట్రీస్ కు దేవాలయ అధికారులు కాంట్రాక్టు ఇచ్చారు. ప్రతి నెల వెండి, బంగారం, ఇత్తడి వస్తువులను శర్వానీ ఇండస్ట్రీస్ పాలిష్ చేయాల్సి ఉంటుంది. శర్వానీ ఇండస్ట్రీస్ నుండి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టును తీసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

మార్చి 20వ తేదీన రథాన్ని పాలిష్ చేసేందుకు సబ్ కాంట్రాక్టర్ వెంకట్ రథాన్ని పరిశీలించాడు. ఈ సమయంలో రథంపై నాలుగు సింహాలు ఉన్నట్టుగా అప్రైజర్ సమీకి సబ్ కాంట్రాక్టర్ వెంకట్ చెప్పినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

మార్చి మాసంలో ఉగాది పర్వదినం కోసం రథాన్ని సిద్దం  చేయడానికి 15 రోజుల ముందు వెంకట్ ఈ రథాన్నిపరిశీలించినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్రైజర్ సమీని పోలీసులు విచారించారు. మరోవైపు ఈ కేసులో సబ్ కాంట్రాక్టర్ వెంకట్ ను పోలీసులు విచారించనున్నారు. వెంకట్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.