చంద్రబాబు సభపై రాళ్ల దాడి: తిరుపతిలో కేసు నమోదు
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నెల 12వ తేదీన తిరుపతి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఓ మహిళ, యువకుడికి స్వల్పగాయాలయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
also read:తిరుపతిలో వైసీపీ ఒక తట్టమట్టి అయినా వేసిందా: చంద్రబాబు
అయితే ఈ దాడిని చంద్రబాబునాయుడి డ్రామాగా వైసీపీ కొట్టిపారేసింది. ఓటమి పాలౌతామని భయంతోనే చంద్రబాబునాయుడు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు తిరుపతి పట్టణంలో నిరసనకు దిగారు.
తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 324,143,427 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.చంద్రబాబునాయుడు సభపై రాళ్ల దాడి చోటు చేసుకోవడంతో ఈ విషయమై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ లు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.మరోవైపు ఇదే విషయమై ఫిర్యాదు చేసేందుకు గాను గవర్నర్ ను కలవాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. తిరుపతి ఉప ఎన్నికకు కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.
also read:తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు
ఇదిలా ఉంటే చంద్రబాబునాయుడు నివాసం ఉన్న ప్రాంతంలో పోలీసులు బందోబస్తును పెంచారు. రాళ్ల దాడి ఘటనపై చంద్రబాబునాయుడు సెక్యూరిటీని పోలీసులు ప్రశ్నించారు. ఎటువైపు నుండి రాళ్లు పడ్డాయి. ఎంతమంది రాళ్లు వేశారు. రాళ్లు వేసిన వారిని గుర్తిస్తారా అని పోలీసులు సెక్యూరిటీని ప్రశ్నించినట్టుగా సమాచారం.