విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమపై బుధవారం నాడు కేసు నమోదైంది. జక్కంపూడిలో టిడ్కో గృహాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో షాబాద్ గ్రామస్తులు ఉమతో వాగ్వాదానికి దిగారు.

ఉమ తమను బెదిరించారంటూ షాబాద్ గ్రామస్తులు దేవినేని ఉమపై ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ 505,506 సెక్షన్ల కింద పోలీసులు కేసునమోదు చేశారు.

టిడ్కో ఇళ్ల వద్ద మంగళవారం నాడు మాజీ మంత్రి దేవినేని ఉమ వెళ్లాడు.ఈ సమయంలో షాబాద్ గ్రామస్తులు ఆయనతో గొడవకు దిగారు.  టిడ్కో గృహాల పరిశీలనకు వెళ్లిన సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీకి చెందిన నేతలపై వైసీపీ నేతలు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు గతంలో పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. 

కేసులతో తమ పార్టీ నేతలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.