పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రత్యర్థుల దాడిలో మరణించిన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రత్యర్థుల దాడిలో మరణించిన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ నేతలు నరసరావుపేటకు బయలుదేరడంతో.. వారు అక్కడి చేరుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే జల్లయ్య అంత్యక్రియలలో పాల్గొని తీరతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటివద్దే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పొందుగుల వద్ద కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులను అరెస్ట్ చేసిన పోలీసులు.. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్రను అడ్డుకున్న పోలీసులు.. వినుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే పోలీసులు తనను ఇంటి ముందే అడ్డుకోవడంపై నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణం తో నన్ను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని పోలీసులను కోరారు. అక్రమంగా తనను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే ఇబ్బందులు పడతారని అన్నారు. పట్టపగలే హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేయడం లేదన విమర్శించారు. పరామర్శలకు వెళ్లే తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.
