గంజాయిపై ఉక్కుపాదం.. అనకాపల్లి జిల్లాలో 2 లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన రెండు లక్షల కేజీల గంజాయిని, 131 లీటర్ల హాష్ ఆయిల్‌ను పోలీసులు దహనం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన రెండు లక్షల కేజీల గంజాయిని, 131 లీటర్ల హాష్ ఆయిల్‌ను పోలీసులు దహనం చేశారు. అనకాపల్లి జిల్లాలోని కోడూరులోని నిర్మానుష్య ప్రదేశంలో శనివారం ఈ గంజాయి దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టినట్టుగా చెప్పారు.
ప్రస్తుతం ధ్వంసం చేసిన గంజాయిలో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టుబడిన 1.35 లక్షల కిలోలు, అనకాపల్లి జిల్లాలో పట్టుబడిన 35,000 నుంచి 40,000 కిలోలు, విజయనగరం జిల్లాలో పట్టుబడిన 9,000 కిలోలు, శ్రీకాకుళం జిల్లాలో పట్టుబడిన 4,000 కిలోలు, పార్వతీపురం మన్యం జిల్లాలో పట్టుబడిన 2,000 కిలోలు ఉంది. దీని మొత్తం విలువు 180 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
ఇక, విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటివరకు ఆరు సార్లు గంజాయిని ధ్వంసం చేశారు. ఇప్పుడు గంజాయిని ధ్వంసం చేయడం ఏడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనకాపల్లి జిల్లా కోడూరులో రూ. 300 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు.
ఇదిలా ఉంటే.. గంజాయి విధ్వంసంలో భాగంగా శుక్రవారం ఏలూరు రేంజ్ పోలీసులు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 64,832 కిలోల గంజాయిని దహనం చేశారు.