తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు. పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.    

తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు.

అయితే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతోనే తాము అనుమతి నిరాకరించినట్లు చెప్పారు.

ఈ క్రమంలో పవన్‌ స్పందించారు. తుని పర్యటన కోసం రేపు రాజమండ్రి వస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు జిల్లా ఎస్పీ.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో పవన్‌ రేపటి తుని పర్యటనపై ఉత్కంఠకు తెరపడింది.