గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అక్కడ ఓ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు అనమానస్పదంగా మారింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే టీడీపీ కార్యాలయం సమీపంలో కారుకు నిప్పుపెట్టారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్టుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయకుండా తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అక్కడ ఓ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు అనమానస్పదంగా మారింది. సందట్లో సడేమియా అన్నట్టుగా కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంలో ఎవరూలేని సమయంలో ఒక్కడే లోనికి వెళ్లి.. అక్కడి వస్తువులను పరిశీలించాడు. ఏదో వస్తువును తన జేబులో వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏమైనా దొరుకుతాయా అని కానిస్టుబుల్ వెతుకుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో గన్నవరం పోలీసులు.. ఆ కానిస్టేబుల్ ఎవరు?.. అతను నిజంగానే చోరీ చేశాడా?.. అనే వివరాలను సేకరించే పనిలో పడినట్టుగా సమాచారం.
