విశాఖ లో హవాలా నగదు కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల భారీగా నగదుతో పాటు గంజాయి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ వివరాలు వెల్లడించారు. 

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక డ్రైవ్‌లో నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ. కోటి నగదు, 29.415 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతం లోని దువ్వాడ రైల్వే బ్రిడ్జి వద్ద దువ్వాడ పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా కారులో 100 కిలోల గంజాయిని గుర్తించారు. 

కారు డ్రైవర్ గౌరవ్‌ (25) ను అదుపు లోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సుబ్బారెడ్డి అలియాస్‌ సురేష్‌ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

విశాఖ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని అల్లిపురం ప్రాంతం లోని ఓ లాడ్జి లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. వారు ఉంటున్న గదిలో తనిఖీలు నిర్వహించగా రెండు బ్యాగుల్లో 29.415 కిలోల వెండి పట్టీలు, కుంకుమ భరిణెలు లభ్యమయ్యాయి. 

వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నిందితులు హిమత్‌ సింగ్‌ రాఠోడ్‌, సోహన్‌ సింగ్‌ లను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అల్లిపురం బైడరా రోడ్డు లోని ఓ హోటల్‌ లో నిర్వహించిన తనిఖీల్లో భరత్‌ కుమార్‌, రాజ్‌ పురోహిత్‌, చోటా రామ్‌ ల అనే వ్యక్తుల వద్ద ఓ బ్యాగును గుర్తించి తనిఖీలు చేయగా రూ. కోటి నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదు సంబంధించి సరైన సమాధానం చెప్పక పోవడంతో దాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేశారు.