ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు నమోదయ్యింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుపై ఈపూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు (GV Anjaneyulu)పై పోలీస్ కేసు నమోదయ్యింది. వినుకొండ (vinukonda) నియోజకవర్గ పరిధిలోని అంగులూరు ఎస్సీ కాలనీలో మూడ్రోజులుగా విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి కాలనీవాసులతో కలిసి ఆంజనేయులు నిరసనకు దిగారు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఈపూరు విద్యుత్ శాఖ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టిడిపి నాయకులు జివి ఆంజనేయులు, జగ్గారావులతో పాటు ఎస్సీ కాలనీవాసులపై పోలీసులు కేసు నమోదు చేసారు.
టిడిపి (TDP) నాయకులు, అంగులూరు ఎస్సీలపై కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (kinjarapu atchannaidu) స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తక్షణమే టీడీపీ నేతలు, దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేసారు.
''తెలుగుదేశం పార్టీ (TDP) నేతలే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోంది. అభివృద్ధిని గాలికి వదిలేసి టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడానికే ప్రభుత్వం తమ సమయాన్ని వెచ్చిస్తోంది. వినుకొండ నియోజకవర్గం అంగులూరు ఎస్సీ కాలనీకి తన దీక్ష ద్వారా కరెంట్ పునరుద్ధరింపజేసిన జీవీ ఆంజనేయులు, ఈపూరు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు రాపర్ల జగ్గారావు, ఇతర దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా'' అన్నారు.
read more స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ1 నిందితుడి అరెస్ట్
''ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేసి సమస్యలను పరిష్కరించడాన్ని జీర్ణించుకోలేక వారిపై తప్పులు కేసులు నమోదు చేస్తున్నారు. జీవీ ఆంజనేయులు విజయాన్ని ఓర్వలేక అధికారులను అడ్డుపెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తూనే ఉన్నారు'' అని మండిపడ్డారు.
''ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారు. తక్షణమే జీవీ ఆంజనేయులు, రాపర్ల జగ్గారావు, ఇతర దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించు కోవాలి. వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.
గతంలో కూడా జివి ఆంజనేయులుపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ ఆంజనేయులుతో పాటు మరికొందరు టిడిపి నాయకులపై శావల్యాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో మనస్తాపానికి గురయిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా ఎదుటే బోరున విలపించిన విషయం తెలిసిందే. ఇలా తమ నాయకుడి భార్య భువనేశ్వరి (nara bhuvaneshwari)పై నిండుసభలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఏపీ అసెంబ్లీ (ap assembly) లో వైసిపి సభ్యుల వ్యవహార తీరును నిరసిస్తూ వినుకొండ నియోజకవర్గ పరిధిలోని శావల్యాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపైకి భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేసారు.
ఈ ఆందోళన ద్వారా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించారంటూ టిడిపి శ్రేణులపై కేసు నమోదయ్యింది. అలాగే ఎన్నికల నిబంధనలను కూడా అతిక్రమించారంటూ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుతో పాటు పలువురు టిడిపి నాయకులపై కేసు నమోదు చేసారు. తాజాగా ఆంజనేయులుపై మరో కేసు నమోదయ్యింది.
