మామకు కరోనా పాజిటివ్.. పరామర్శకు వెళ్లిన అల్లుడిపై కేసు
పిల్లనిచ్చిన మామకి ఆరోగ్యం సరిగాలేదు. ఆస్పత్రిలో చేర్చితే కరోనా పాజిటివ్ అన్నారు. దీంతో తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి రహస్యంగా ఆస్పత్రిలో ఉన్న మామ వద్దకు వెళ్లి పరామర్శించి వచ్చాడు. కాగా.. మామ గారిపై ప్రేమ చూపించిన అల్లుడిపై పోలీసులు కన్నెర్ర చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన మామ గారింటికి ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కొడుకుని సెవలకు పంపాడు. అతనిది ప్రకాశం జిల్లా కాగా... పాఠశాలలకు సెలవలు ఇచ్చారని కొడుకుని అక్కడకు పంపాడు. అయితే... ఇటీవల అతని మామకు గుండె నొప్పి రావడంతో బంధువులు గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్ అని తేల్చారు. దీంతో.. ప్రకాశం జిల్లాలోని రామకృష్ణాపురం లో ఉన్న అల్లుడు.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి.. చీరాల నుంచి గుంటూరు వెళ్లారు.
మామ గారిని పరామర్శించి.. ఆస్పత్రి వద్ద ఉన్న తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకొని ఇంటికి చేరాడు. అయితే.. ఈ విషయం ఎవరికీ తెలీకుండా గోప్యంగా ఉంచాడు. అయితే.. ఎలాగోలా విషయం పోలీసులకు తెలియడంతో.. అతనిపై మండిపడ్డారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్ కి తరలించారు.