Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్ : నంద్యాలలో రాత్రంతా హై డ్రామా (వీడియో)

చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో రాత్రంతా నంద్యాలలో హై డ్రామా నెలకొంది. పోలీసులు చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. 

Police came to Arrest Chandrababu Naidu in nandyal- bsb
Author
First Published Sep 9, 2023, 7:46 AM IST

నంద్యాల : నంద్యాలలో హైడ్రామా నెలకొంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్ వద్దకు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు, సీఐడీ అధికారులు బస చేసిన ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అంతకుముందు చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధిక సంఖ్యలో పోలీసులు చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. దీనికోసం అనంతపురం నుంచి నంద్యాలకు పోలీసు బృందాలను రప్పించారు.  అలా మొత్తం ఆరు బస్సుల్లో ఎస్పీ కార్యాలయం వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు భారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలి వచ్చిన టిడిపి శ్రేణులను అరెస్టులు చేశారు. శనివారం ఉదయం ఐదు గంటల తర్వాత వాహనం చుట్టూ ఉన్న టిడిపినేతలను అరెస్టు చేశారు.  అరెస్ట్ చేసిన వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల, ప్రియ జగద్విఖ్యాతిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి తదితర స్థానిక టిడిపి నేతలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన బస చేసిన బస్సు నుంచి కిందికి దిగడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

మరోవైపు, అరెస్టకు ముందు 6 గంటలపాటు నంద్యాలలో హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటలనుంచే అటు టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా పోలీసులు, సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున చంద్రబాబు బస చేసిన చోటికి వెళ్లారు. దీనికి ముందే నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్ కే ఫంక్షన్ హాల్ లోకి ఎలా వెళ్లాలి, టీడీపీ శ్రేణులను ఎలా అడ్డుకోవాలి... అని పక్కా ప్రణాళిక ప్రకారం సీఐడీ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయన లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉంది, ఆయనకు డయాబెటిస్ ఉంది అని తెలిపారు. వైద్యపరీక్షల తరువాత సీఐడీ అరెస్ట్ చేయబోతున్నారని తెలిపారు. స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసు కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు. 

ఆయనను 52 సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.  ఐపీసీ సెక్షన్లు 166, 167,418, 420 కింద కేసులు పెట్టారు. సెక్షన్లు 465,468, 479, 409,201 లు ఆయన మీద పెట్టారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయని రామ చంద్రరావు అన్నారు. ఆయనను నంద్యాల నుంచి విజయవాడ తరలించనున్నారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనను ఇక్కడినుంచి విమానంలో తరలించాలని వారు కోరుతున్నారు. రోడ్డు మార్గంలో అయితే ఆరు గంటలపాటు ప్రయాణం అని.. అంత ప్రయాణంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబుతో పాటు సీఎస్ఓ, ఎన్ఎస్ జీ కూడా వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు పేర్లను సీఐడీ చేర్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios