కడప: కడప జిల్లా చిన్నమండెంలో సంచలనం సృష్టించిన పల్లపు శంకరయ్య హత్య కేసులో 22 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 14 ఏళ్ల మైనర్ కూడ ఉన్నాడు.

కడప జిల్లా రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, చిన్నమండెం ఎస్ఐ హేమాద్రి శుక్రవారంనాడు రాత్రి ఈ ఘటనకు సంబంధించి మీడియాకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

పడమటికోన వడ్డిపల్లెకు చెందిన పల్లపు శంకరయ్య మూడు బస్తాల వేరుశనగ కాయలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ వద్ద అప్పుగా తీసుకొన్నారు. ఈ విషయాన్ని వలంటీర్ ముత్తన శ్రీనివాసులు చెప్పడంతో అతడి బాబాయ్ ముత్తన రెడ్డప్ప శంకరయ్యను నిలదీశారు. మే 29వ  తేదీన శంకరయ్య ఇంటికి వెళ్లి డబ్బులు అడిగాడు. 

దీనిపై ఇద్దరూ గొడవ పడ్డారు. గొడవ పడుతూనే రామాలయం వద్దకు చేరుకొన్నారు. శంకరయ్య సోదరుడు వల్లపు రెడ్డయ్య మరికొందరు వచ్చివారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో శ్రీనివాసులు చిన్నాన్న నారాయణ కత్తితో వల్లపు రెడ్డప్ప తలపై నరికాడు. రామచంద్ర అనే వ్యక్తి తలపై కొట్టాడు. స్థానికులు ఇరువర్గాలను మందలించారు. దీంతో ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

అదే రోజు రాత్రి పదిన్నర గంటలకు మహేష్, సురేంద్ర, ధనుంజయ, కిశోర్, శంకరయ్యలు మోటారు సైకిళ్లపై పల్లెకు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన ముత్తన శ్రీనివాసులు వర్గీయులు కలిబండ రోడ్డులో వీరిపై దాడి చేయాలని ప్లాన్ చేశారు.

ఎనిమిది మంది మహిళలు కారంపొడి, కట్టెలతో శంకరయ్య, శ్రీనివాసులు, నారాయణ, యల్లప్పతో పాటు మరో 10 మంది రోకలి బండలు, కర్రలతో  పల్లపు శంకరయ్య వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో వల్లపు శంకరయ్య అక్కడికక్కడే మరణించాడు. మహేష్, సురేంద్ర, ధనుంజయలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి నుండి కిషోర్ తప్పించుకొన్నాడు. 

గాయపడిన మహేష్ అనే వ్యక్తి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడ విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.  నిందితులు చిన్నమండెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారరు. మరికొందరు రామాపురం బస్టాప్ లో ఉన్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా సీఐ చెప్పారు. శంకరయ్యను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు కూడ పాల్గొన్నాడు. ఈ బాలుడు ఈ ఏడాది జూలై మాసంలో జరగనున్న టెన్త్ పరీక్షలు రాయాల్సి ఉంది.