వారికి వివాహమై ఏడేళ్లు అవుతోంది. నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ... భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో.... ఆమె అతనిని భరించలేకపోయింది. భర్తను వదిలేసి ... కొడుకుతో సహా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అక్కడ వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో... వెంటనే అతనిని పెళ్లి చేసుకుంది. కానీ... ఈ పెళ్లి బంధానికి మొదటి భర్త అడ్డుగా ఉన్నాడని ఆమెకు అనిపించింది. అందుకే రెండో భర్తతో కలిసి పథకం ప్రకారం హత్య చేసింది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతానికి చెందిన సంజీవ(26)కు అదే ప్రాంతానికి చెందిన లలితతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లుగా సంజీవ మద్యానికి బానిసగా మారాడు. దీంతో లలిత కొడుకును తీసుకొని రేణిగుంట వెళ్లిపోయింది. అక్కడ రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా... అది ప్రేమగా మారింది.

ఇటీవల రమేష్ ని పెళ్లి కూడా చేసుకుంది. అక్కడే ఇద్దరూ బిక్షాటన చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. కాగా... వారం రోజుల కింద రేణిగుంట రైల్వే స్టేషన్ లో లలితకు తన మొదటి భర్త సంజీవ కనిపించాడు. వెంటనే సంజీవ తన భార్య లలితను కడప తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కూడా కడప వచ్చాడు..

సంజీవకు తెలీకుండా రమేష్... లలితను కలుసుకున్నాడు. సంజీవ బతికి ఉంటే... తాము కలిసి జీవించలేమని... అందుకు అతనిని చంపేయాలని వీరిద్దరూ పథకం వేసుకున్నారు.  పథకం ప్రకారం.... సంజీవ తప్పతాగి నిద్రపోతున్న సమయంలో... రమేష్.. బండరాయితో అతని తలపై మోదాడు. సంజీవ చనిపోయాడు అని నిర్ణయించుకున్నాక.. ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... బంధువుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.