మన దేశంలో.. రోజుకి ఎంతో మంది బాబాలు పుట్టుకొస్తూ ఉంటారు. ఎంతో మంది బాబాలు ప్రజలను మోసం చేస్తున్నారంటూ రోజూ టీవీల్లో, పేపర్లో వార్తలు వస్తున్నప్పటికీ.. ప్రజలు ఈ బాబాలను నమ్మడం మాత్రం మానరు. తాజాగా.. మరో బాబా పుట్టుకొచ్చాడు.

కర్నూలు జిల్లా ఆత్మకూరులో కొరుకుడు బాబు పుట్టుకొచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ప్రజలను ఆయన కొరుకుతాడు. ఒక్కొక్కరిని కొరికేందుకు రూ.100 నుంచి రూ.200 దాకా ఫీజు గుంజుకుంటాడు. తన పంటిగాట్లు పడితే ఉన్న రోగాలు పోతాయని, సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారని ప్రచారం చేసుకున్నాడు.

 యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన కొప్పుల రాంరెడ్డి అనే వ్యక్తివీ లీలలు. రాంరెడ్డికి భార్య, కూతురు ఉంది. అతడు చదివింది ఆరో తరగతే. ఆ మధ్య నల్లగొండ జిల్లా చెర్వుగట్టుకు వెళ్లి అక్కడే ఏడాది పాటు ఉన్నాడు. అక్కడ జాతకాలు, యంత్రాలు కట్టే వారితో పరిచయం పెంచుకొని కొన్ని కిటుకులు నేర్చాడు. తనకు దేవుడు ఆవహించాడంటూ ఇంటి వద్ద శిగం ఊగడం మొదలుపెట్టాడు.
 
కొన్నాళ్లకు తాను కొరికితే మీకు వచ్చిన రోగాలు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మించడం మొదలుపెట్టాడు. ఆడామగా తేడా లేకుండా మీద పడి కొరకడం, ఒళ్లంతా తడమడం, మగవారిని పడుకోబెట్టి తొక్కడం లాంటి చేష్టలకు పాల్పడేవాడు. ఈ వికృత చేష్టలను చూసి కొందరు ఆ బాబా బాగోతాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియా, యూ ట్యూబ్‌లో పోస్టు చేశారు. స్పందించిన పోలీసులు శుక్రవారం రాంరెడ్డిని అరెస్టు చేశారు.