Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసుల.. ప్రధాన నిందితుడిగా వెల్దుర్తి ఎంపీపీ

Guntur జిల్లా వెల్ధుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. 

Police arrest accused in TDP leader Thota Chandraiah death case
Author
Guntur, First Published Jan 14, 2022, 2:35 PM IST

గుంటూరులో టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. చంద్రయ్య బైక్‌పై వెళ్తుండగా ఆపి నిందితులు కత్తులతో దాడి చేసినట్టుగా చెప్పారు. ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్యలో ఈ హత్య జరిగిందన్నారు. చంద్రయ్య కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా చెప్పారు. నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. 

ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా శివరామయ్యకు చంద్రయ్యకు పాత గొడవలు ఉన్నాయని చెప్పారు. చంద్రయ్య, శివరామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారని తెలిపారు. గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయని.. సిమెంట్ రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. 

‘తోట చంద్రయ్య శివరామకృష్ణను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, అతని మీద తప్పకుండా దాడి చేస్తాడని కొంత మంది గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే చంద్రయ్య  అతడిపై దాడి చేయకముందే.. చంద్రయ్యపై దాడి చేయాలని శివరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన నిందితులతో కలిసి హత్య చేశారు. అన్ని ఆధారాలతో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశాం’ అని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నట్టు తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. 


నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి… చింత శివ రామయ్య, చింత యలమంద కోటయ్య, సాని రఘు రామయ్య, సాని రామకోటేశ్వరరావు , చింతా శ్రీనివాసరావు,  తోట ఆంజనేయులు, తోట శివ నారాయణ, చింతా ఆదినారాయణ.

Guntur జిల్లా వెల్ధుర్తి మండలం గుండ్లపాడులో చంద్రయ్య హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మరోవైపు  టీడీపీ గుండ్లపాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా చంద్రయ్య కొనసాగుతున్నాడు. గ్రామ సెంటర్ లో చంద్రయ్య కూర్చున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు.చంద్రయ్యను హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోయారు. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న police మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు. 

ఇక, ఈ ఘటనపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ క్యాడర్‌ను భయాందోళనలకు గురిచేసేందుకు వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలపై దాడులు, కేసులు పెరిగిపోయాయని అన్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు వెళ్లి... చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. చంద్రయ్య అంతిమయాత్రలో స్వయంగా చంద్రబాబు పాడె మోశారు.

Follow Us:
Download App:
  • android
  • ios