పోలవరం చీఫ్ ఇంజనీర్ పై జగన్ సర్కార్ బదిలీవేటు
వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.

అమరావతి: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ పదేపదే ఆరోపిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అధ్యయన కమిటీని సైతం నియమించింది. అంతేకాదు పోలవరం రివర్స్ టెండిరింగ్ కు కూడా వెళ్తోంది. ఈ పరిణామాల నేపథ్యంతో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం వెంకటేశ్వరరావు రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఉంటూనే పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ గా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తాజాగా వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.
వెంకటేశ్వరరావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్ బాబు ఇకపై పోలవరం చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించనున్నారు.