అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్డీఏలో చేరాలంటూ కోరారు. ఎన్డీఏలో చేరితో రెండు మంత్రి పదవులు ఇస్తామంటూ జగన్ కు హామీ ఇచ్చారు.  

మోదీ, షాల ఆఫర్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి తమను ఆదుకోవాలని కోరారట. 

రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదాయే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారట. ఈనెల 26న ప్రధాని నరేంద్రమోదీతో ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్ ప్రత్యకంగా భేటీ అయ్యారు. గంటకుపైగా మోదీతో రాష్ట్రంలోని సమస్యలపై చర్చించారు. 

ఆ చర్చలలోనే మోదీ జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అనంతరం అమిత్ షాతో భేటీ కావాలని కూడా సూచించారట. అమిత్ షా సైతం వైయస్ జగన్ కు ఎన్డీఏలో చేరాలంటూ ఆఫర్ ప్రకటించారు. రెండుమంత్రి పదవులు ఇస్తామని అందులో ఒకటి కేబినెట్ సహాయమంత్రి అని కూడా క్లియర్ గా చెప్పారట. 

గతంలో ఏపీకి ఇచ్చిన పౌరవిమానయాన శాఖను ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే మోదీ, షాల ఆఫర్ పై అంతగా ఆసక్తి చూపని జగన్ పదవులు కంటే హోదాయే ముఖ్యమని నవ్వుతూ చెప్పారట. అనంతరం పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని చెప్పారట. అయితే ఈనెల 29లోపు చెప్పాలని వైయస్ జగన్ కు కండీషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ఎన్డీఏ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరో పార్టీ మద్దతు కోరాల్సిన అవసరం లేదు. అయితే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వైయస్ జగన్ తో కలిసి పయనించాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు.