Asianet News TeluguAsianet News Telugu

‘అమరావతి’పై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదు.. ముఖ్యమంత్రి, మంత్రులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం...

రాజధాని అమరావతిలో పనులు పూర్తి చేయడానికి 60 నెలల సమయం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్ ను తిరస్కరించాలని కోరుతూ రైతులు డి. సాంబశివరావు, మరికొందరు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

 

Plea In High Court Seeks Contempt Action Against AP Chief Minister, Ministers over not following Judgment on Amravati
Author
Hyderabad, First Published Apr 23, 2022, 7:36 AM IST | Last Updated Apr 23, 2022, 7:36 AM IST

అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని..  ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలంటూ శుక్రవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఎర్రబాలెం గ్రామానికి చెందిన రైతు దోనె సాంబశివరావు,  అయినవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. కోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులను ప్రభావితం చేస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  sameer sharma, జిఎడి ప్రత్యేక సిఎస్ జవహర్ రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత, శాసనసభ కార్యదర్శి పి.బాల కృష్ణమాచార్యులు, రహదారులు భవనాల ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణ బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,  పురపాలక శాఖ పూర్వ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లను వ్యక్తిగత హోదాలోప్రతివాదులుగా పేర్కొన్నారు.

రాజధాని అమరావతిని నిర్మించాలని,  రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ,  విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు నెలరోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఆర్ టిఏలను ఆదేశిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి 3న తీర్పునిచ్చింది. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరునెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి  చేయాలని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ప్రకారం అధికారులు వ్యవహరించకపోవడంతో రైతులు కోర్టు ధిక్కరణ  వ్యాజ్యం వేశారు. 

న్యాయస్థానం తీర్పును అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిలో అధికారులతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉన్నందున వారినీ కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలి అన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయడం మంత్రివర్గ బాధ్యత అన్నారు. అధికారులు వెనుక మంత్రులు ఉండి కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా చూస్తున్నారన్నారు. వారు న్యాయపాలనకు  విఘాతం కలిగిస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి,  ప్రతివాదులుగా పేర్కొన్న మంత్రులూ కోర్టు ధిక్కరణ చట్టం సెక్షన్ 2(6) ప్రకారం శిక్షకు అర్హులన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారంలో అధికారులు విధులు నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ చేస్తామని హైకోర్టు తీర్పులో పేర్కొంది అని గుర్తు చేశారు. భూ సమీకరణ పథకం నిబంధనల ప్రకారం…  నిర్దిష్ట సమయం ఇస్తూ  నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది అన్నారు. ఇప్పటివరకు పనులను చేపట్టడం లేదని అన్నారు. ఇది కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందన్నారు.  కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో రాజధాని ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు. ఏపీసిఆర్ డిఏ చట్టంలోని  సెక్షన్ 61 ప్రకారం ‘టౌన్ ప్లానింగ్ స్కీమ్స్’ను  అమలు చేయకుండా  కోర్టు ధిక్కరణ కేసు పాల్పడ్డారన్నారు.

భూములు ఇచ్చిన రైతులు  రహదారులు, నీటి వసతులు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంగించారు అన్నారు.. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ప్రతి వాదులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios