ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫ్యాన్ గాలి బాగా వీయడంతో... వైసీపీ అధినేత జగన్... ఏపీ సీఎం అయ్యారు. అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ జగన్ దాదాపు పదేళ్ల పాటు కష్టపడ్డారు. ఆయన పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. దీంతో... ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 

అయితే... ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్... ఆయన పేరు ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం పేరు కనపడినా వైసీపీ అభిమానులు ఊరుకోవడం లేదు. దీనికి నిదర్శనమే మచిలీపట్నంలోని ఓ సంఘటన.

ఇంతకీ మ్యాటరేంటంటే... మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఓ శిలా ఫలకం ఉంది. దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అని పేరు రాసి ఉంది. దానిని చూసిన వైసీపీ అభిమానులు రెచ్చిపోయారు. ఆ శిలా ఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబే ఉన్నారు కాబట్టి... ఆ సమయంలో ఆ శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆ  శిలాఫలకం మీద పేరు అలా రాసి ఉందని చెబుతున్నారు.