మంత్రి పితాని సత్యానారాయణ పార్టీ మారుతున్నారని... గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై పితాని తాజాగా క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. తాను పార్టీ మారడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు.
 
తన జీవితం తెరిచిన పుస్తకమని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌, ఢిల్లీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను ఎక్కడికి వెళ్లకూడదా అని అన్నారు. హైదరాబాద్‌కు వెళ్తే పార్టీ మారినట్టేనా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

తనపై విమర్శలు చేసిన వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 2 సార్లు ఓడిపోయా..3 సార్లు గెలిచానని.. మరోసారి పోటీకి వెళ్తున్నానని మంత్రి పితాని స్పష్టం చేశారు. వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోందని, తనపై వైసీపీ కుట్రలు పనిచేయవని ఆయన అన్నారు.