Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియా వల: గుర్రుమన్న మంత్రి పితాని

సోషల్ మీడియా సమాచారాన్ని ఎంత వేగంగా చేరవెయ్యగలదో అంతే గందరగోళాన్ని సృష్టించగలదు. ఊహాగానాలతో సోషల్ మీడియా బారినపడిన బాధితులు కూడా ఉన్నారు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ కూడా అదేకోవలో చేరిపోయారు. సోషల్ మీడియా బాధితుడిగా మారారు. 

Pitani condemns social media campaign
Author
Eluru, First Published Dec 13, 2018, 4:22 PM IST

ఏలూరు: సోషల్ మీడియా సమాచారాన్ని ఎంత వేగంగా చేరవెయ్యగలదో అంతే గందరగోళాన్ని సృష్టించగలదు. ఊహాగానాలతో సోషల్ మీడియా బారినపడిన బాధితులు కూడా ఉన్నారు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ కూడా అదేకోవలో చేరిపోయారు. సోషల్ మీడియా బాధితుడిగా మారారు. 

మంత్రి పితాని సత్యనారాయణ పార్టీ మారతారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదికూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో.  వాట్సప్‌ లో అయితే ఇక చెప్పనవసరం లేదు. అదిగో మారిపోతున్నారంటే తేదీలు కూడా ఖరారు చేస్తూ కథనాలు షేర్ అవుతుండటం ఆయన బోరున విలపిస్తున్నారు. 

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలో ఆంధ్రాలో కూడా రాజకీయ వేడి పెంచాలనో లేక గందరగోళం సృష్టించాలనో తెలియదు కానీ వాట్సప్ మెసేజ్ లతో రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే వాట్సప్ లో వస్తున్న కథనాలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పితాని నిశబ్ధంగా ఉండిపోతున్నారు. 

ఆ కథనాలను ఖండించి మరో చర్చకు తెరలేపడం ఎందుకు అని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీ మార్పుపై విపరీతంగా ప్రచారం జరుగుతుండటంతో కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. పితాని సత్యనారాయణను నిలదీశారు. అయితే తనకేం తెలియదు మెుర్రో అని మెుత్తుకోవడంతో ఏం చెయ్యలేక తిరిగొచ్చేశారట.

అయితే ఈ ప్రచారం అంతా పితాని సత్యనారాయణను మానసికంగా దెబ్బకొట్టేదుకు ప్రత్యర్ధిలు ఇలాంటి తప్పుడు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనవరి నెలలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున బీసీ సదస్సు జరగనుంది. ఆ సదస్సును మంత్రి పితాని సత్యనారాయణ తన భుజస్కందాలపై వేసుకున్నారు.  

ఈ తరుణంలో మంత్రి దృష్టిని మళ్ళించేందుకు, రాజకీయ దుమారం లేపేందుకే కొందరు ఇలాంటివి పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలని ఇదంతా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 

తెలుగుదేశం పార్టీలో మంత్రి పితాని సత్యనారాయణ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరొందారు. అలాగే ఆచంట నియోజకవర్గంలోనూ తిష్టవేసి వరుసగా విజయాలు సాధిస్తున్నారని దానికి బ్రేక్ లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 
 
తాను పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కార్యకర్తల గందరగోళానికి గురవుతున్నారు. పదేపదే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొందరైతే పితాని పార్టీ బోర్డు మార్చేస్తున్నారంటూ నమ్మేస్తాయికి వచ్చేశారు. 

ఈ ప్రచారం ఇలాగే జరిగితే రాబోయే ఎన్నికల్లో తన గెలుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని గ్రహించిన పితాని ప్రచారాలను ఖండించారు. తాను టీడీపీలో చేరినప్పటి నుంచి ఎలాంటి వివాదాస్పద కార్యక్రమాల్లో పాల్గొనకుండా, పార్టీ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నానని దాన్ని చూసి ఓర్వలేక, కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం ఇది అంటూ కొట్టిపారేశారు. 
 
తనను నేరుగా ఎదుర్కొనలేక కొంతమంది దుష్ప్రచారంతో తన ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నిస్తున్నారని వారి కోరిక ఏమాత్రం తీరదన్నారు. ఆరోపణలు చేసేవారు ముందుకు వచ్చి మాట్లాడాలని కోరారు. కుళ్ళు, కుతంత్రాలతో లేనిపోనివి సృష్టించడం సరికాదన్నారు. కొందరు కావాలని చేస్తున్న మైండ్‌ గేమ్‌ ఇది అంటూ మంత్రి కొట్టిపారేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios