పాపం...అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయం చేయమని కోరితే దివ్యాంగురాలన్న కనికరం కూడా లేకుండా బాలిక బంధువే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ  అఘాయిత్యం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నకరకల్లు మండలం చల్లగుండ గ్రామానికి చెందిన 13 ఏళ్ల దివ్యాంగ బాలిక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఎనిమిదో తరగతి చదువుతూ బాలిక వసతిగృహంలో నివాసముంటోంది. 

అయితే ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో స్వగ్రామానికి వెళ్లింది. ఆరోగ్యం మెరుగుపడ్డాక కుటుంబ సభ్యులు బాలికను వరసకు మామ అయ్యే కోటేశ్వర రావు వెంట ద్విచక్ర వాహనంపై పంపిచారు. అయితే బాలిక ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని అతడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను నేరుగా పాఠశాలకు కాకుండా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అనంతరం వసతిగృహం వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక హాస్టల్ సమీపంలో వుంటున్న బంధువులకు తెలియజేసింది. దీంతో ఈ అఘాయిత్యం గురించి బయటపడింది. 

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.